'రాయపాటి' రగిలిపోతున్నాడా..? సత్తెనపల్లి 'కోడెల' కేనా..?

'రాయపాటి' రగిలిపోతున్నాడా..? సత్తెనపల్లి 'కోడెల' కేనా..?

గుంటూరు/సత్తెనపల్లి : గుంటూరు జిల్లాలో 'రాయపాటి' కుటుంబం టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే, రాయపాటి వయసు రీత్యా ఈసారి పోటీ చేయడం కష‌్టమే. ఆయన ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయనని తన సన్నిహితుల వద్ద కూడా చెబుతున్నట్లు తెలుస్తోంది. కానీ తన వారసులను మాత్రం పోటీ చేయించాలని కోరుకుంటున్నారు. తమ కుటుంబానికి రెండు సీట్లు కావాలని రాయపాటి సాంబశివరావు ఆ మధ్య చంద్రబాబును నేరుగా కోరారు. కానీ ఒక్క టిక్కెట్ కూడా రాయపాటి కుటుంబానికి ఇవ్వడం కష్టమేనంటున్నారు. ఇంతవరకూ ఆ కుటుంబానికి పార్టీ అధినేత నుంచి స్పష్టమైన హామీ లభించలేదు.

గత 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం టిక్కెట్ ను రాయపాటి శ్రీనివాస్ కు ఇవ్వాలని సాంబశివరావు చంద్రబాబును కోరారు. కానీ, అక్కడ స్థానిక ఎమ్మెల్యే, అప్పటి స్పీకర్ అయిన కోడెల శివప్రసాద్ కే టికెట్ కేటాయించారు. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో కూడా కోడెల కుటుంబానికే టిక్కెట్  ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సమీకరణాలు ఎలా వున్నా కోడెల శివప్రసాద్ చనిపోవడంతో ఆయన కుమారుడు కోడెల శివరామ్ కు అక్కడ టిక్కెట్ ఇవ్వడమే న్యాయమని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాయపాటి కినుక వహించినట్లు భోగట్టా. అలాగే, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని రాయపాటి శైలజ కోరుతున్నారు. అక్కడ తెనాలి నియోజకవర్గం పొత్తులో భాగంగా జనసేనకు వెళితే ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ఇవ్వాలనుకుంటున్నారు. దీంతో అక్కడ కూడా శైలజకు అవకాశం లేదు. అయితే, రాయపాటి కుటుంబానికి నరసరావుపేట లోక్ సభ స్థానం ఇవ్వాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారు. కానీ రాయపాటి కుటుంబం అందుకు ఇష్టపడటం లేదు. దీంతో రాయపాటి సాంబశివరావు కొంత ఆగ్రహంతో ఉన్నారు. ఆయన కుటుంబం కూడా పార్టీకి దూరంగా ఉంటోంది. ఇటీవల జరిగిన ఒంగోలు మహానాడుకు కూడా రాయపాటి జనసమీకరణ చేయలేదన్న నివేదికలు చంద్రబాబుకు అందాయి.

What's Your Reaction?

like
2
dislike
0
love
1
funny
0
angry
0
sad
1
wow
0