పది పరీక్షలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితం ప్రయాణం..

పది పరీక్షలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితం ప్రయాణం..

అమరావతి : రాష్ట్రంలో ఈ నెల 27వ తేదీ నుంచి మే తొమ్మిదో తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గురువారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు ఆరు లక్షల 22 వేల 746 మంది విద్యార్థులు హబుూజరు కానున్నారు. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 7 వేల 780 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏడాది పరీక్షలను జంబ్లింగ్‌ విధానంలో నిర్వహిస్తుండటంతో విద్యార్థుల పరీక్షా కేంద్రాలు వేరే ప్రాంతాల్లో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా, వారిపై ఎలాంటి చార్జీల భారం పడకుండా ఉచిత రవాణా సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌ సూచనల మేరకు ఆర్టీసీ వారందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి ఉదయం 9.30కు పరీక్షలు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు పూర్తవుతాయి. ఈ సమయాలకనుగుణంగా విద్యార్థులు తమ నివాసాల నుంచి పరీక్షా కేంద్రానికి, తిరిగి ఇళ్లకు చేరుకునేలా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో హాల్‌ టికెట్లను చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని స్పష్టం చేసింది.

What's Your Reaction?

like
0
dislike
1
love
2
funny
1
angry
0
sad
0
wow
4