ప్రజాగళం పేరుతో మరిన్ని సభలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయం!
టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఖరారయ్యాక తొలిసారిగా నిన్న పల్నాడు జిల్లా బొప్పూడి వద్ద ప్రజాగళం సభ నిర్వహించారు. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
నిన్న ప్రజాగళం సభ జరిగిన తీరుపై చంద్రబాబు అందుబాటులో ఉన్న టీడీపీ సీనియర్ నేతలతో నేడు సమీక్ష నిర్వహించారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, సభ విజయవంతం అయిందనే టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా, ఎన్డీయే కూటమిని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ప్రజాగళం పేరే సరైనదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే, రాష్ట్రంలో ప్రజాగళం పేరుతో మరిన్ని సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు టీడీపీ వర్గాలు ప్రజాగళం సభల రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నాయి.
టీడీపీ ఇంకా 16 మంది అసెంబ్లీ అభ్యర్థులను, 17 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ జాబితాలు మరో రెండ్రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. అనంతరం చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లనున్నారు.
ఎన్నికలకు తగినంత సమయం ఉండడంతో కూటమిలో ఉత్సాహం పెల్లుబుకుతోంది. మే 13న పోలింగ్ జరగనుంది. అప్పట్లోగా ప్రజాగళం సభలను విస్తృతస్థాయిలో నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కూటమి భావిస్తోంది.