హాయిగా నిద్ర పోవాలంటే..
ఒక సర్వే ప్రకారం భారతీయుల్లో నిద్ర శాతం తగ్గుతోంది. రోజు రోజుకీ నిద్రలేమితో బాధపడే వాళ్లు అధికమవుతున్నారు. సరైన జీవన విధానం లేకపోవటం, ఒత్తిడి, ఎక్కువ సమయం మొబైల్, కంప్యూటర్ల తెరలకు జీవితాన్ని అంకితం చేయడం, కరోనా పరిస్థితుల వల్ల నిద్ర కరువైందని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి సరైన నిద్రకోసం ఏంచేయాలి...?_
ఎవరికైనా కనీసం ఏడు గంటల నిద్ర అవసరం. అయితే మానసిక ఒత్తిళ్ల వల్ల నిద్ర సరిగా రావటం లేదని యువత చెబుతున్నారు. యాభై ఏళ్లు దగ్గర పడ్డ వారిలో 30 శాతం నిద్రలేమితో బాధ పడుతున్నారు. నిద్ర సరిగా పట్టకపోవడం వల్లనే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అధిక రక్తపోటు, చక్కెర వ్యాధి, అతి బరువు, గుండెపోటు, మెదడులో నరాలు చిట్లడం.. లాంటి సమస్యలు వచ్చిపడుతున్నాయి.మంచి నిద్ర అనేది ఔషధం లాంటిదే. హాయిగా నిద్ర పోతే శారీరక సమస్యలు తలెత్తవు. ముఖ్యంగా మానసి కంగా చురుగ్గా ఉంటారు. మొత్తానికి నిద్ర సరిగా పట్టా లంటే కొన్ని మెలకువలు పాటించాలి. తల క్రింద మెత్త లేదా తలగడ సరైనది ఉంచుకోవాలి. లేకుంటే మెడ నొప్పులు వచ్చే అవకాశాలెక్కువ. కొందరికి ఫ్యాను పడదు, మరికొందరికి బయట శబ్దాలు వస్తోంటే నిద్ర రాదు. ఇంకొందరు ఇంట్లో ఏ చిన్న శబ్దం వచ్చినా క్షణాల్లో నిద్రలేస్తారు. మొత్తానికి విషయమేంటంటే ఇలాంటి సమస్య ఉండే వాళ్లు చుట్టుపక్కల వాతావరణం నిశ్శబ్దంగా ఉంచుకోవాలి.నిద్రపోయేముందు ప్రశాంతంగా ఉండాలి. ఇష్టమైన సంగీతం వినడం, హాస్య చిత్రాల్ని చూడాలి. సాధారణంగా వాతావరణం వేడిగా ఉండటం వల్ల శరీరం కూడా వేడి ఉంటుంది. దీనివల్ల నిద్రపోలేం. అందుకే శరీరాన్ని చల్లబ రిచే పరుపును వాడాలి. ఇక కొందరు బరువైన దుప్పటి కప్పుతుంటారు. దీనివల్ల నిద్రపట్టదు. నలభై ఐదు కేజీల బరువుండే ఒక వ్యక్తి ఆరు కిలోలకంటే బరువైన రగ్గును వాడితే నిద్రలేమితో కొట్టుమిట్టాడాల్సిందే. రోజూ ఏడు గంటలు నిద్రపోయిన తర్వాత ఉదయాన్నే లేచి వాకింగ్ చేయడం, యోగా, ధ్యానం లాంటి పనులు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ అతిగా నిద్రపోతే అంటే రోజుకు తొమ్మిదిగంటలు నిద్రకు కేటాయిస్తే.. బీపీతో పాటు డయాబెటీస్ లక్షణాలు పెరుగుతాయి. మొత్తానికి నిద్రకోసం ప్రణాళిక ఉండాలి. సాధ్యమైనంత వరకూ రాత్రిపూట నిద్రపోవటమే ఉత్తమం. అందులో కూడా మెలకువలేని డీప్ స్లీప్ ఉండటం ఆరోగ్యానికి మంచిదే.