సుందర నగరంగా కడపను అభివృద్ధి చేస్తాం..
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజద్ భాష
రూ.3.80 కోట్లతో నగరంలోని స్థానిక 20 వ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన.....
కడప,జూన్ 12
కడప నగరాభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి.అంజాద్ బాష పిలుపునిచ్చారు. శనివారం స్థానిక 20 వ డివిజన్ పరిధిలోని రాజీవ్ మార్గ్ నాలుగు రోడ్ల కూడళ్ల వద్ద రూ. 3.80 కోట్లతో నూతన రోడ్ల విస్తరణ పనులకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్ బాష,నగర మేయర్ కె.సురేష్ బాబులతో కలసి శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజద్ బాష మాట్లాడుతూ కడప నగరాభివృద్ధిలో భాగంగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రాజీవ్ మార్గ్ (ట్యాంక్ బండ్) రోడ్ల విస్తరణ, సుందరీకరణ పనులకు నేడు భూమి పూజ చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి జిల్లా అభివృద్ధి విషయంలో ఎంతో కృతనిశ్చయంతో ఉన్నారన్నారు.ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా కడప నగరాన్ని రాష్ట్రంలో ఆదర్శవంతమైన, సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతామన్నారు.
రాజీవ్ మార్గ్ (ట్యాంక్ బండ్)ను పట్టణాల తరహాలో అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. కడప వాసుల ఆరోగ్య దృష్ట్యా రాజీవ్ మార్గ్ రోడ్డుకి ఇరుపక్కల మార్నింగ్,ఈవెనింగ్ వాక్ చేసే పాదచారుల కోసం వాకింగ్ జోన్ గా రూపొందిస్తామని తెలిపారు. అలాగే కడప ను మెట్రోపాలిటన్ పట్టణాలకు తీసిపోకుండా రాత్రిపూట 12.30గం వరకు అందు బాటులో ఉండేవిధంగా ఫుడ్ స్ట్రీట్ ను ఏర్పాటు చేసి రాబోయే కాలంలో ఫుడ్ జోన్ గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.
ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కడప నగరంలోని ప్రధాన మార్గాలలో పార్కింగ్ సమస్యలను పరిష్కరించే విధంగా ఇప్పటికే 16 రోడ్ల విస్తరణ పనులు ప్రారంభించామని తెలిపారు. ఇందులో రెండు ప్రధాన రోడ్లు పూర్తిఅయ్యాయని రాబోవు జులై మాసంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంబోత్సవం చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే మరో నాలుగు రోడ్ల విస్తరణ పనులకు టెండర్లు పూర్తయ్యాయని వీటితో పాటు కడప నగరానికి భవిష్యత్ లో ప్రమాదాలు కలుగకుండా వర్షాకాలంలో బుగ్గవంక పరివాహక ప్రాంత ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా బుగ్గవంక కాలువకు 1.5 కిలోమీటర్ల మేర ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి రూ.50 కోట్లతో రక్షణగా ప్రహరీ గోడ నిర్మాణానికి రాబోయే మాసంలో సీఎం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.అలాగే భవిష్యత్తులో కడపను ప్రణాళికాబద్ధంగా మరింత అభివృద్ధి చేస్తామన్నారు.ఇందుకు ప్రజల సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో కడప మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ లవన్న,20 వ డివిజన్ కార్పొరేటర్ మాధవి, నగర కార్పొరేటర్లు,మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు,వైఎస్సార్సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.