సీఎం చంద్రబాబు కు హై-రిస్క్ వీఐపీల భద్రత

సీఎం చంద్రబాబు కు హై-రిస్క్ వీఐపీల భద్రత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్, ఆ తర్వాత కూడా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఎవరి మీద ఎటువంటి దాడులు కొనసాగుతాయన్నది అర్థంకాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతల మీద ఏపీలో అక్కడక్కడ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో టిడిపి శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తుంది.

దేశవ్యాప్తంగా 9 మంది ‘హై రిస్క్’ వీఐపీల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. వీరి భద్రత నుంచి ఎన్‌ఎస్‌జీ కమాండోలను పూర్తిగా ఉపసంహరించుకొని, ఆ బాధ్యతలను సీఆర్‌పీఎఫ్‌కు అప్పగించేందుకు సిద్ధమైంది. వచ్చే నెలలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన కొత్త బెటాలియన్‌ను సీఆర్‌పీఎఫ్‌కు కేటాయిస్తూ కేంద్ర హోమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇటీవలే పార్లమెంటు భద్రతా విధుల నుంచి ఉపసంహరించిన వీఐపీ భద్రతా విభాగాన్ని సీఆర్‌పీఎఫ్ 7వ బెటాలియన్‌గా కేటాయించింది.

హై-రిస్క్ వీఐపీలు వీరే..
ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌ (ఎన్‌ఎస్‌జీ) బ్లాక్ క్యాట్ కమాండోలు 'జెడ్ ప్లస్' కేటగిరీ భద్రత కల్పిస్తున్న వీఐపీలు 9 మంది ఉన్నారు. ఈ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీఎస్‌పీ అధినేత్రి మాయావతి, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, బీజేపీ సీనియర్, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఉన్నారు. వీరందరి భద్రతను ఇకపై సీఆర్‌పీఎఫ్ చూసుకోనుంది. సీఎం చంద్రబాబు భద్రతను ఎన్‌ఎస్‌జీ నుంచి సీఆర్‌పీఎఫ్‌కి మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల బృందం ఇటీవల ఢిల్లీకి వెళ్లిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

కాగా రెండు బలగాల మధ్య భద్రతా విధుల బదిలీ ప్రక్రియ ఒక నెల లోపు పూర్తవుతుందని కేంద్ర హోంశాఖ వర్గాలు భావిస్తున్నాయి. వీఐపీల భద్రతా విధుల నుంచి ఎన్‌ఎస్‌జీని ఉపసంహరిస్తే దాదాపు 450 మంది 'బ్లాక్ క్యాట్' కమాండోలు కేంద్రానికి అందుబాటులో ఉంటారు. ఎన్‌ఎస్‌జీని కేవలం ఉగ్రవాద నిరోధానికి మాత్రమే వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

What's Your Reaction?

like
1
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0