వానా కాలం పంటలకు సర్వం సిద్ధం

వానా కాలం పంటలకు సర్వం సిద్ధం

మెదక్, మే 25,
యాసంగిలో పంటలు బాగాపండి దండిగా ధాన్యం రావడం, కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రభుత్వం మద్దతు ధరతోనే గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చేస్తుండడంతో రైతుల్లో సంతోషం నెలకొంది. ధాన్యం అమ్మిన డబ్బులు చేతికి జల్ది అందుతుండడంతో వారిలో ఉత్సాహం నెలకొంది. ఇదే ఉత్సాహంతో వానకాలం సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం పొలాల్లో పేడ వేయడం, గడ్డిని తొలగించడం, పత్తి కట్టెలను ఏరడంతో పాటు వేసవి దుక్కుల్లో రైతులు బిజీగా ఉన్నారు. ఈనెల 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానున్నది. రోహిణిలోనే వరినారు పోసుకునేలా రైతులను వ్యవసాయశాఖ అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. తొలిసారి సిద్దిపేట జిల్లాలో ఈసారి ఆయిల్‌పాం సాగుకు శ్రీకారం చుడుతున్నారు.యాసంగిలో దండిగా ధాన్యం పండగా దిగుబడులు ఘననీయంగా పెరిగాయి. రైతులకు అనుకూలంగా గ్రామాల్లోనే మద్దతు ధరతో ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. ఇదే ఉత్సాహంతో రైతులు వానకాలం సాగుకు సమాయత్తం అవుతున్నారు. ప్రస్తుతం పొలాల్లో పేడ వేయడం, గడ్డిని తొలిగించడం, పత్తి కట్టెలను ఏరడంతో పాటు వేసవి దుక్కుల్లో రైతులు బిజీగా మారారు. ఈ నెల 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. సాగుకు అదును దాటితే సరిగ్గా పంట రాదన్నది రైతుల నమ్మకం. సరైన సమయంలోనే సాగు పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. రోహిణి కార్తె ప్రారంభం కాగానే వరి నార్లు పోయడానికి సిద్ధ్దమవుతున్నారు. రోహిణిలోనే వరినార్లు పోసుకునేలా రైతులను సన్నద్ధం చేయాలని ఇటీవల ఆర్థ్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు వ్యవసాయశాఖ అధికారులకు టెలీకాన్ఫరెన్స్‌లో సూచించారు. ఇందుకు అనుగుణంగా సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు వానకాలం సాగు ప్రణాళికను సిద్ధ్దం చేశారు. ఆయా ఆగ్రోస్‌ కేంద్రాలు, అనుమతి పొందిన దుకాణాల్లో ఎరువులు, విత్తనాలతో పాటు జీలుగ, జనుమును అందుబాటులో ఉంచారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై ప్రత్యేక నిఘాను పెట్టారు. రైతులకు పెట్టుబడుల నిమిత్తం రైతుబంధు కింద ఎకరానికి రూ.5వేల చొప్పున రెండు పంటలకు గాను రూ.10వేలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. వానకాలం పంట పెట్టుబడికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రైతుబంధు డబ్బులను విడుదల చేయనున్నది. సిద్దిపేట జిల్లాలో రంగనాయక, కొండపోచమ్మ రిజర్వాయర్లతో పాటు తోటపల్లి ఆన్‌లైన్‌ రిజర్వాయర్‌, తపాస్‌పల్లి రిజర్వాయర్‌, శనిగరం మధ్యతరహా ప్రాజెక్టులు, మెదక్‌ జిల్లాలో మంజీరా, హల్దీ ప్రాజెక్టులు, సంగారెడ్డి జిల్లాలో సింగూరు ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల కింద ఈ సారి సాగు విస్తీర్ణం పెరుగనున్నట్లు అధికారుల అంచనా.2021 సంవత్సరం వానకాలం సాగు అంచనాను వ్యవసాయ శాఖ అధికారులు రూపొందించారు.

ఈ ఏడాది అన్ని పంటలు కలిపి 5.30 లక్షల ఎకరాల్లో సాగు కానున్నదని అధికారుల అంచనా. ఇందుకు తగ్గట్టుగా ఎరువులు, విత్తనాలను అన్ని మండల కేంద్రాలతో పాటు పట్టణ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. ఎక్కువగా వరి, పత్తి, కంది తదితర పంటలను సాగుచేసేలా రైతులను అధికారులు సమాయత్తం చేస్తున్నారు. జిల్లాలో కొత్తగా ఈ సారి ఆయిల్‌పాం సాగు సైతం కానున్నది. వ్యవసాయశాఖ అధికారులు రూపొందించిన వానకాలం సాగు అంచనా ప్రకారం, అన్ని పంటలు కలిపి 5,30,578 ఎకరాల్లో సాగు కానున్నాయి. జిల్లాలో 2.71 లక్షల మంది రైతులు ఉన్నారు. మొత్తం సాగుభూమి 6.21 లక్షల ఎకరాలు ఉంది. వానకాలం సాగులో భాగంగా జిల్లాలో 2,23,626 ఎకరాల్లో వరిసాగు అంచనా వేశారు. ఇందుకోసం 40,253 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధ్దంగా పెట్టారు. అత్యధికంగా పత్తి పంటను సాగు చేసేలా ప్రభుత్వం గతేడాది నుంచి రైతులను ప్రోత్సహిస్తున్నది. 2,43,100 ఎకరాల్లో పత్తి సాగుకు 4,86,201 పత్తి ప్యాకెట్లు, మొక్కజొన్న 11,283 ఎకరాల్లో, విత్తనాలు 895 క్వింటాళ్లు, వేరుశనగ 738 ఎకరాల్లో, 443 క్వింటాళ్ల విత్తనాలు, పెసర 946 ఎకరాల్లో, 76 క్వింటాళ్లు, కంది 50,885 ఎకరాల్లో 3,053 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధ్దంగా ఉంచారు. ఎరువులు 48,945 మెట్రిక్‌ టన్నుల యూరియా, 26,002 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 9,381 మెట్రిక్‌ టన్నుల ఎంవోపీ, 51,595 మెట్రిక్‌ టన్నుల ఎన్‌పీకే, మొత్తం 1,35,923 మెట్రిక్‌ టన్నుల ఎరువులను జిల్లా కోసం కేటాయించారు.మెదక్‌ జిల్లాలో వరి పంటకు సంబంధించి 1.85 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి గతేడాది 85వేల ఎకరాల్లో సాగుకాగా, ఈ సారి 95వేల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంది. కంది గతేడాది 17వేల ఎకరాల్లో సాగుచేశారు. ఈ సారి 30వేల ఎకరాల్లో సాగు అంచనా వేస్తున్నారు. అన్ని పంటలు కలిపి 3,21,650 ఎకరాల్లో రైతులు సాగు చేయనున్నారని వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. జిల్లాకు మొత్తం 38,200 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరమని అంచనా సిద్ధం చేశారు. డీఏపీ 4,260 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 2700 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 5,550 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ 14,500 మెట్రిక్‌ టన్నులు అవసరమని అంచనా వేశారు. 46,250 క్వింటాళ్ల వరి విత్తనాలు, 1,200 క్వింటాళ్ల కందులు, 900 క్వింటాళ్ల పత్తి, 272 క్వింటాళ్ల పెసర్లు, 360 క్వింటాళ్ల సోయాబీన్‌, 80 క్వింటాళ్ల జొన్న, 60 క్వింటాళ్ల మినుములు అవసరమవుతాయని వ్యవసాయ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది 7,40,845 ఎకరాల్లో పంటలు సాగుచేస్తారని అధికారులు అంచనా వేశారు. 49,231.45 వేల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను సిద్ధం చేశారు. 1,20,953 మెట్రిక్‌ టన్నుల ఎరువులను నెలల వారీగా అందుబాటులో ఉంచారు. గతేడాది కంటే ఈ సారి 1400 ఎకరాల్లో అధికంగా పంటలు సాగుకానున్నట్లు వ్యవసాయాధికారుల నివేదికలో పేర్కొన్నారు. అత్యధికంగా పత్తి సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. 4.20 లక్షల ఎకరాల్లో పంట వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. సోయాబీన్‌ ఈ సారి కేవలం 15,000 ఎకరాల్లో సాగుకానున్నట్లు అధికారులు తెలిపారు.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0