రాజుకుంటున్నమహిళా పోలీసుల యూనిఫామ్ కొలతల వివాదం..
నెల్లూరు : మహిళా పోలీసుల యూనిఫామ్ కొలతల వివాదం నెల్లూరు జిల్లాలో రాజుకుంది. నెల్లూరు జిల్లా మహిళా పోలీసులకు కొత్త యూనిఫాంలు అందించాలన్న పోలీసు శాఖ నిర్ణయం అనుకోని రీతిలో వివాదం రూపుదాల్చింది. మహిళా పోలీసులకు ఓ మగ టైలర్ కొలతలు తీసుకోవడం పట్ల దుమారం చెలరేగింది. సదరు టైలర్ మహిళా పోలీసుల కొలతలు తీస్తుండగా, ఓ వ్యక్తి ఆ ప్రక్రియను సెల్ ఫోన్ తో ఫొటోలు తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై నెల్లూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. పురుష టైలర్ తో మహిళా పోలీసులకు కొలతలు తీయించడం అటుంచితే, కొలతలు తీస్తుండగా అనుమతి లేకుండా సెల్ ఫోన్ తో ఫొటోలు తీసిన వైనంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు ఈ ఘటనపై నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు మాట్లాడుతూ, యూనిఫాం కోసం కొలతలు తీస్తున్నప్పటి ఫొటోలు బయటికి వచ్చాయంటూ మహిళా పోలీసులు ఫిర్యాదు చేశారని వెల్లడించారు. సెల్ ఫోన్ తో ఫొటోలు తీసిన వ్యక్తిని తాము గుర్తించామని ఆయన వెల్లడించారు. తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఏపీ మహిళా కమిషన్ ఆరా..
కాగా, నెల్లూరు మహిళ పోలీస్ యూనిఫామ్ కొలతల కు సంబంధించిన ఘటన పై ఏపీ మహిళా కమిషన్ ఆరాతీసింది. ఈమేరకు .
మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పురుష టైలర్ తో మహిళా పోలీస్ యూనిఫామ్ కొలతల తియ్యడం పై నెల్లూరు ఎస్పీ తో మాట్లాడారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరక్కుండా చూస్తామని నెల్లూర్ ఎస్పీ హామీ ఇచ్చారు.
మహిళలంటే అంత చులకనా?
విజయవాడ : నెల్లూరు పోలీస్ అధికారులకు మహిళలంటే అంత చులకనా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. నెల్లూరు పోలీస్ గ్రౌండ్లో మహిళా పోలీసు యూనిఫామ్ కొలతలు తీసేందుకు మగ పోలీసులను వినియోగించటం దేనికి సంకేతమన్నారు.