'దేవర' టికెట్ ధరల పెంపుపై చంద్రబాబు కీలక నిర్ణయం
RRR మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు బయటకొస్తున్న అప్‌డేట్స్ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి.
ఆరు సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తున్న చిత్రం కావడంతో దేవరపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆరు సంవత్సరాల క్రితం అరవింద సమేతలో నటించారు. తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా రామ్ చరణ్ తో కలిసి చేశారు. దేవరకు కొరటాల శివ దర్శకుడు. దీనికి ముందు శివ చేసిన ఆచార్య ఫ్లాప్ కావడంతో యంగ్ టైగర్ అభిమానులను ఈ విషయం భయపెడుతోంది. దాదాపు రూ.300 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించారు. ఇందులో మొదటి భాగం ఈనెల 27వ తేదీన విడుదల కాబోతోంది.
అనుమతులు వస్తాయా? రావా? అనే సందేహం ఇంత బడ్జెట్ తో పెట్టిన చిత్రం విజయం సాధించాలంటే డబ్బుల రికవరీ బాగా ఉండాలి. ఏరియాలవారీగా బిజినెస్ కూడా భారీగా జరిగింది. సినిమా మీద రోజురోజుకు హైప్ పెరిగిపోతోంది. పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకోవాలంటే ఏపీ, తెలంగాణలో టికెట్ ధరలు పెంపు ఉంటేనే సాధ్యపడుతుంది. దీనికి ముందు విడుదలైన కల్కి చిత్రానికి కూడా టికెట్ ధరలు పెంచుకునేందుకు రెండు ప్రభుత్వాలు అనుమతివచ్చాయి. అయితే దేవర చిత్రం జూనియర్ ఎన్టీఆర్ ది కావడంతోపాటు వివిధ రాజకీయ కారణాల నేపథ్యంలో ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు వస్తాయా? రావా? అనే సందేహం నెలకొంది.
వివిధ రాజకీయ కారణాల నేపథ్యంలో.. నందమూరి కుటుంబ సభ్యులతో తారక్, కల్యాణ్ రామ్ దూరంగా ఉండటం, చంద్రబాబు అరెస్ట్ సమయంలో స్పందించకపోవడం, కొడాలి నాని, వల్లభనేని వంశీలాంటివారిని అదుపుచేయకపోవడంలాంటివన్నీ కలిసి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని పెంచాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం తారక్ ట్వీట్ చేయగా దానికి చంద్రబాబు బదులిచ్చారు.
మోక్షజ్ఞ విజయం సాధించాలని, తాతగారి పేరు నిలబెట్టాలంటూ తారక్ ఇటీవలే ట్వీట్ చేశారు. వరదలవల్ల నష్టపోయిన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు చెరి రూ.50 లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించారు. తాజాగా అందిన సమాచారం మేరకు దేవర సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని మల్టీఫ్లెక్స్‌ల్లో రు. 413, సింగిల్ థియేటర్లలో రు. 250, ఏపీ మల్టీఫ్లెక్స్ ల్లో రు.325, సింగిల్ థియేటర్లలో రు. 200 పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చినట్లు సమాచారం.