దిగ్భ్రాంతికర ఘటన.. చేతులెత్తి వేడుకున్న కానిస్టేబుల్
ఢిల్లీ: సొసైటీకి రక్షణ నిలయంగా భావించే పోలీస్ స్టేషన్‌లో.. అదీ అంతా చూస్తుండగానే ఓ పోలీస్ కానిస్టేబుల్‌పై నిర్ధాక్షిణ్యంగా దాడి జరిగింది. పైగా ఆ దాడిని కొందరు వీడియోలు తీస్తుండగా.. తనను వదిలేయాలని ఆ సిబ్బంది చేతులెత్తి వేడుకోవడం వైరల్ అవుతోంది.
దిగ్భ్రాంతికరమైన ఈ ఘటన న్యూఢిల్లీ ఆనంద్ విహార్ పోలీస్ స్టేషన్‌లో జరిగింది. సుమారు పది, పన్నెండు మంది చుట్టూ చేరి ఆ కానిస్టేబుల్‌ను విచక్షణ రహితంగా కొట్టారు. చుట్టుపక్కల చాలా మంది ఆ ఘటనను వీడియో, ఫొటోలు తీశారు. అయితే ఎవరూ వాళ్లను ఆపే ప్రయత్నం చేయలేదు. బాధితుడు ఆ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్‌గా తెలుస్తోంది.
క్షమించి వదిలేయాలని ఆ కానిస్టేబుల్ వేడుకోవడం వీడియోలో చూడొచ్చు. ఆగస్టు 3వ తేదీన ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఓ పోలీస్ సిబ్బంది సైతం వీడియో తీసి వైరల్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీడియో ఉన్నతాధికారుల దాకా చేరడంతో విచారణకు ఆదేశించారు. కానిస్టేబుల్‌పై జరిగిన దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
అయితే కారణాలు ఏవైనా పోలీసులపై దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు కొందరు. దాడి చేసిన వాళ్లను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. వీడియో వైరల్ అవుతుండడంతో నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని చెబుతోంది ఢిల్లీ పోలీస్ విభాగం.