చిలకలూరిపేట లో మాజీ ప్రధాని వాజ్ పేయ్ కాంస్య విగ్రహావిష్కరణ
భారతావని గర్వించే రాజకీయ శిఖరం వాజ్ పేయ్
ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
చిలకలూరిపేట, డిసెంబర్ 25 (ఇండియా జ్యోతి) : పట్టణంలో మంగళవారం ఘనంగా వాజ్ పేయ్ శతజయంతి వేడుకలు జరిగాయి.
స్వతంత్ర భారత చరిత్రలో గొప్ప రాజనీతిజ్ఞుడిగా, భారతావని రక్షణార్థం దేశానికి అణు కవచం తొడిగిన ధీరుడు, ప్రత్యర్ధులు సైతం మెచ్చే అజాత శత్రువు, దేశ ప్రజలకు సుపరిపాలన అందించిన దార్శనికుడు, మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పేయ్ అని, అటువంటి మహానీయుని విగ్రహం చిలకలూరిపేట పట్టణంలో ఏర్పాటు చేయడం నియోజకవర్గానికే గర్వకారణమని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కొనియాడారు.చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో ఏర్పాటుచేసిన వాజ్ పేయ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. భారతావని గర్వించే రాజకీయ శిఖరం, మచ్చలేని వ్యక్తి, మకుటం లేని మహారాజు, భారతరత్న, కవి, ఉర్రూతలూగించే ప్రసంగాల్లో దిట్ట, మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పేయ్ విగ్రహం చిలకలూరిపేటలో నెలకొల్పడం నియోజకవర్గంతో పాటు రాష్ట్రానికే గర్వకారణమని పుల్లారావు అభిప్రాయపడ్డారు. నైతిక విలువలకు కట్టుబడి, ప్రజాస్వామ్య పరిరక్షణకోసం దేశ ప్రధాని పదవిని కేవలం ఒక్క ఓటు తేడాతో తృణప్రాయంగా వదిలేసిన రాజకీయ శిఖరం వాజ్ పేయ్ అని,ప్రోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించి భారతదేశ శక్తి సామర్థ్యాలు,శౌర్యప్రతాపాలను ప్రపంచానికి చాటి చెప్పిన ధీరోధాత్తుడని ప్రశంసించారు. టెలికం రంగంలో విప్లవాత్తక సంస్కరణలకు నాందిపలికి, ప్రజల మధ్య అంతరాలను సాంకేతికంగా తగ్గించడంలో వాజ్ పేయ్ విజయం సాధించారని,జాతీయ రహదారుల నిర్మాణంలో నూతన సంస్కరణలకు నాందిపలికి దేశఆర్థికాభివృద్ధికి బాటలు వేసిన దార్శనికుడు వాజ్ పేయ్ అని పుల్లారావు కొనియాడారు. గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా గ్రామాలను అనుసంధానిస్తూ దేశవ్యాప్తంగా లక్షల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం వాజ్ పేయ్ హయాంలోనే జరిగిందని,అంగన్ వాడీ కేంద్రాలకు రూపకల్పన చేసి, పేద పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించిన ఘనత కూడా వాజ్ పేయ్ కే దక్కుతుందన్నారు. భారతదేశాన్ని అనుసంధానిస్తూ జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలన్న వాజ్ పేయ్ ఆలోచన వెనక, నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ముందుచూపు ఎంతో ఉందని పుల్లారావు చెప్పారు. నాటి కేంద్రప్రభుత్వంలో కీలక భాగస్వామిగా చంద్రబాబు వ్యవహరించారని, వాజ్ పేయ్ తో తనది ప్రత్యేక అనుబంధమని,దేశ ప్రగతికి ఉపయోగపడే ఎన్నో సూచనలు, సలహాలు ఆ మహానుభావుడికి అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చంద్రబాబు అంటే వాజ్ పేయ్ కి ఎంతో మక్కువ, ఎనలేని అభిమానమని, ఈ విషయాన్ని బాబు పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్నారన్నారు. వాజ్ పేయ్ శతజయంతి వేళ చిలకలూరిపేట ప్రధాన కూడలి N.R.T కూడలిలో ఆ మహానీయుని విగ్రహాం ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయమని,ఇంత మంచి పనికి చొరవచూపిన బీజేపీ నాయకులు అన్నం శ్రీనివాసరావు తదితరుల్ని, విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి పార్టీల నేతలు కార్యకర్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. కార్యక్రమ నిర్వాహకులు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదానాన్ని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బిట్ర వెంకట శివనారాయణ, రొంగల గోపి, కొక్కెర శ్రీనివాస్, జనసేన ఇంచార్జి తోట రాజా రమేష్, టిడిపి నాయకులు నెల్లూరి సదా శివరావు, షేక్ కరిమూల్లా, పఠాన్ సమథ్ ఖాన్, కామినేని సాయి బాబు తదితరులు నాయకులున్నారు.