చిలకలూరిపేట లో బస్సు షెల్టర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి
చిలకలూరిపేటలో అన్ని సదుపాయాలు కలిపించేలా చర్యలు
చిలకలూరిపేట, డిసెంబర్ 25 (ఇండియా జ్యోతి) ; పట్టణంలోని కళామందిర్ సెంటర్లో మంగళవారం బస్ షెల్టర్ ను మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. క్రిస్మస్ పండుగ నాడు ప్రయాణికుల సౌకర్యార్థం పట్ణణంలోని కళామందిర్ సెంటర్లో బస్ షెల్టర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక శుభదినాన ప్రజలకు, ముఖ్యంగా ఆర్టీసీ ప్రయాణికులకు ఉపయోగపడే బస్ షెల్టర్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మున్సిపాలిటీ స్థలంలో స్థానిక తెదేపా సీనియర్ నాయకులు గోపతోటి అన్నారావు వారి మనవరాలు ఆమె భర్త మహేశ్ లు (వింజనంపాడు వాస్తవ్యులు) నిర్మాణం చేపట్టి, ప్రయాణికులు కూర్చోవడానికి అవసర మైన బెంచీలు, తాగునీరు వంటివి ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నానన్నారు. ప్రయాణికులు బస్ షెల్టర్ ను సద్వినియోగం చేసుకోవాలని, పరిశుభ్రంగా ఉంచి వినియోగించుకోవాలని మాజీ మంత్రి సూచించారు. అదే విధంగా త్వరలోనే చిలకలూరిపేట పట్టణ ప్రజలకోసం ఫుడ్ స్ట్రీట్ అందుబాటులోకి తీసురానున్నట్టు ఆయన చెప్పారు. హైదరాబాద్, విజయవాడ మహానగరాల మాదిరే ఫుడ్ స్ట్రీట్ ఏర్పాటు చేయాలని అందుకు అవసరమైన స్థలాన్ని మున్సిపల్ మరియు పోలీస్ విభాగాలు ఎంపిక చేయాలని పుల్లారావు సదరు శాఖల అధికారులను ఆదేశించారు. ఫుడ్ స్ట్రీట్ లో స్టాల్స్ ఏర్పాటు చేసే నిర్వాహకులు లాభాపేక్ష లేకుండా పట్టణ ప్రజలకు రుచికరమైన, నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని మాజీ మంత్రి తెలిపారు.