ఘోరం : పెళ్లి వేడుకల్లో పోలీసులు డీజేకు అనుమతి ఇవ్వలేదని.. వరుడు ఆత్మహత్య..
పెళ్లి వేడుకల్లో పోలీసులు డీజేకు అనుమతి ఇవ్వలేదని.. వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజస్థాన్‌లోని బన్‌స్వారా ప్రాంతంలో జరిగింది. అయితే డీజేకు అనుమతి ఇవ్వకపోవడం వల్లే వరుడు చనిపోయాడనే వాదనను పోలీసులు కొట్టిపారేశారు. వివారాలిలావున్నాయి. దవడిమాల్ గ్రామానికి చెందిన వినోద్ వివాహానికి ఈ నెల 24 ఉదయం ముహూర్తంగా నిర్ణయించారు. 23 రాత్రి నుంచే అతని ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఇల్లంతా కోలాహలంగా వుంది. వరుడు వినోద్ చాలా ఆనందంగా, ఉల్లాసంగా వున్నాడు. అయితే పెళ్లి వేడుకలో డీజే ఏర్పాటు చేయాలనేది వినోద్ కోరిక. అయితే అందుకు పోలీసులు నిరాకరించారని పలువురు పేర్కొన్నారు. దీంతో 23 రాత్రంతా వినోద్ అసంతృప్తిగానే ఉన్నాడు. భోజనం కూడా చేయలేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత వినోద్ ఒక్కడే బయటకు వెళ్లాడు. ఎంత సేపటికీ తిరిగి రాలేదు. దీంతో స్నేహితులు, బంధువులందరూ వినోద్ కోసం గాలించారు. ఈ క్రమంలో సమీపంలోని వేప చెట్టుకు వినోద్ ఉరేసుకుని కనిపించాడు. దీంతో షాకైన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. పోస్ట్‌మార్టమ్ తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అందించారు. డీజేకు అనుమతి ఇవ్వకపోవడం వల్లే వరుడు చనిపోయాడనే వాదనను పోలీసులు కొట్టిపారేశారు. దర్యాఫ్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ ఘటన పెళ్ళింతా విషాదం చోటుచేసుకుంది.