కోహినూర్ వజ్రం… అద్భుతమా..? అరిష్టమా..? చరిత్ర ఏం చెబుతోంది
అనగనగా ఒక కథ.... ఈ కథ పూర్తిగా చదవాల్సిందే... దేనికంటే భారతదేశ నేల వజ్రాలకు ప్రసిద్ధిగాంచింది.. అలాంటి దేశంలో ఆంధ్రప్రదేశ్ లో... గుంటూరు జిల్లా కోల్లూరు గ్రామంలో దొరికిన కోహినూర్ డైమండ్ కదా..ప్రపంచం మొత్తం గొప్ప గా చెప్పుకునే మన డైమాండ్ కధ....పూర్తి సమాచారం.. ఈ కథలో...మన సంపద విషయాలు...అందరికి తెలిసేలా..
కోహినూర్… అద్భుతమా..? అరిష్టమా..? చరిత్ర ఏం చెబుతోంది?*
కోహినూర్..ఒక శాపగ్రస్తమైనది అంటే నమ్మగలరా..?
దీన్ని ధరించినవారు అనతి కాలంలోనే చనిపోతారనేది కూడా ప్రచారంలో ఉంది. కోహినూర్ ఒక అరిష్టమని కూడా అంటుంటారు..?
ఇవన్నీ నిజలేనా..?
వాస్తవంగా కోహినూర్ ఎక్కడ దొరికింది.?
ఇప్పుడు దీని విలువ ఎంత..?
బ్రిటన్ ఎందుకు వెళ్లింది..?
దీనిపై అసలు హక్కుదారులు ఎవరు..?
శాపగ్రస్తమని ప్రచారంలో ఉన్న ఈ కోహినూర్ కహాని ఏంటి?
చరిత్ర కారులు చెప్పిన ప్రకారం...
కాకతీయుల కాలం లో..కాకతీయ రాజు ప్రతాప రుద్రుడు ఆస్థాన సమయంలో...భారతదేశం లో ఆంద్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా..కోళ్ళురూ గ్రామంలో కృష్ణ నది ఒడ్డున దొరికింది అని...చరిత్ర చెబుతోంది...
వాస్తవానికి కోహినూర్ వజ్రం పుట్టినిల్లు ఇక్కడే...అది మన పల్నాడు లో...
ఒక పర్షియన్ పాలకుడు ఈ వజ్రాన్ని తొలిసారిగా చూసి ఆశ్చర్యంతో వాహ్.. ‘కోహ్ ఇ నూర్’ అని పిలిచాడు… దాంతో ఈ వజ్రానికి కోహినూర్ వజ్రం అనే పేరు అలాగే స్థిరపడింది
దొరికినప్పుడు 793 క్యారెట్స్ ఉండేదట.. కానీ, దాన్ని కోసి కుదించారట. ప్రస్తుతం ఈ కోహినూర్ డైమాండ్105.6 క్యారెట్లు గా ఉంది..
ఢిల్లీ సుల్తాన్ చేతిలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఓటమి పాలుకావడంతో
సంధిలో భాగంగా అపారమైన సంపదతో పాటు కోహినూర్ వజ్రాన్ని కూడా ఢిల్లీ సుల్తాన్ లకు అప్పగించాల్సి వచ్చిందట.అప్పటి వారి ఒప్పందం మేరకు ఢిల్లీ సుల్తాన్ ఆ కోహినూర్ వజ్రాన్ని తన వెంట తీసుకుని వెళ్లాడు. అలా కోహినూర్ ఢిల్లీకి చేరింది.
అలా కాకతీయుల తర్వాత, కోహినూర్ తుగ్లక్లు, సయ్యద్‌లు, లోడీలు, మొఘలులు, ఆఫ్ఘన్‌లు, సిక్కులు, మరాఠాలు వంటి అనేక మంది పాలకులు, రాజవంశాల చేతుల్లోకి వెళ్లింది.
చేతులు మారిన ప్రతిసారి వజ్రం దాని ఆకారం, పరిమాణంలో కూడా అనేక మార్పులకు గురైంది.
ఎవరికి నచ్చిన ఆభరణాల కోసం వారు దీన్ని కత్తిరించటం, పాలిష్ చేయటం జరిగింది.
కోహినూర్ చివరకు 1849లో బ్రిటీష్ వారి చేతికి చిక్కింది.
దక్షిణ భారతదేశం నుండి ఇంగ్లాండ్ వెళ్లిన ఈ వజ్రం మాదంటే మాదంటూ అనేక దేశాలు వాదిస్తున్నాయి.
భారతదేశం, పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ ఈ వజ్రం తమదేనని చెబుతున్నాయి.
ఎన్ని దేశాలు వాదించినప్పటికీ ఈ కోహినూర్ మాత్రం నేటికీ బ్రిటిష్ వారి హయాంలోనే ఉంది.
ఈ ప్రయాణంలో వజ్రం ఎన్నో యుద్ధాలు, కుట్రలు, హత్యలకు కారణంగా మారింది.
ఎందుకంటే ఆనాటి పాలకులు అందరూ దాని అందం, విలువను కోరుకున్నారు.
దాన్ని సొంతం చేసుకోవటం కోసం మారణహోమాలు సృష్టించారు.
ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఆ యుద్దాల్లో అమాయక ప్రజలు సైతం చావును చూశారు.
ఈ క్రమంలోనే శాపగ్రస్తమైనదిగా, దీన్ని స్వాధీనం చేసుకున్నవారు ఎంతో కాలం వర్ధిల్లలేరని ప్రచారం సాగింది..
కోహినూర్ వజ్రం..ప్రపంచంలో కెల్లా అత్యంత విలువైనది అంటారు.. కానీ, దాని కచ్చితమైన విలువ ఎంత అన్నది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే..ఇంతవరకు దానిని ఎవరూ కొనుగోలు చేయలేదు. ఎప్పుడూ దీనిని ఒకరి నుంచి మరొకరు లాక్కొవడం,, దోచుకోవడం లేదంటే డిమాండ్ చేసి దొచుకెళ్లటం మాత్రమే జరిగింది. అయితే, ఈ వజ్రం మొఘల్ దండయాత్రతో బాబర్ చేతిలో ఉన్నప్పుడు అతను దాని విలువను చాలా భిన్నంగా అంచనా వేసాడు. కోహినూర్ ఎంతో విలువైనదని, అది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు మూడు వారాలపాటు ఆహారం అందించగలదని ఆయన వివరించినట్టు ప్రచారం. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. కోహినూర్‌కు నామకరణం చేసిన నాదిర్ షా..దీని విలువను మరింత భిన్నంగా పోల్చి చెప్పారు. ఒక వ్యక్తి నాలుగు దిక్కులకు రాయి విసిరి, ఆ మధ్యలో ఉన్న ఖాళీని బంగారంతో నింపినట్టయితే.. దాని మొత్తం విలువ కూడా ఈ కోహినూర్‌తో సరిపోదని చెప్పాడట. అయితే, ఇక్కడే కోహినూర్ వెనుక మరో ఆశ్చర్యకర కథనం కూడా ప్రచారంలో ఉంది. కోహినూర్ 1100-1300 సంవత్సరాల మధ్య కాకతీయ సామ్రాజ్య ఆధినంలో ఉండగా, వరంగల్‌లోని కాకతీయ దేవాలయంలో ఉన్న ప్రధాన దేవత విగ్రహంలో కన్ను రూపంలో పొందుపరచబడి ఉండేదని చెబుతారు. కాకతీయుల నుంచి అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ వజ్రాన్ని దోచుకున్నాడని, ఆ తరువాత, పానిపట్ యుద్ధంలో మొఘల్ వ్యవస్థాపకుడు బాబర్ ఆగ్రా, ఢిల్లీ కోటలను జయించుకుని ఈ వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నాడని కూడా చెబుతారు. ఇలా కాల క్రమేణా కోహినూర్ ఢిల్లీ సామ్రాజ్యానికి చేరింది.1526లో ఇబ్రహీం లోడిని ఓడించిన తర్వాత ఢిల్లీ సంపద అంతా బాబర్ చేతుల్లోకి వెళ్లి పోయింది..అప్పుడే.. బాబర్ రాసుకున్న తన ఆత్మకథలో కోహినూర్‌ను ‘డైమండ్ ఆఫ్ బాబర్’ అని పేర్కొన్నాడు. ఇక్కడి నుంచే మనకు కోహినూర్‌కు సంబంధించిన మొదటి లిఖిత పూర్వక సాక్ష్యం లభించింది. 1526లో బాబర్ దీనిని జయించిన తర్వాత గ్వాలియర్ రాజుకు దీనిని బహుమతిగా ఇచ్చాడని కొందరు నమ్ముతారు. అదంతా ఎలా జరిగిరంది…ఏం జరిగింది అనేది ఒక్కో ఆధారం ఒక్కోలా చెబుతుంది. కానీ, బాబర్ వంశస్థుడైన షాజహాన్ దీనిని తన ఆభరణాలతో కూడిన సింహాసనంలో అధిరోహించాడని చెబుతారు. అప్పుడు 186 క్యారెట్లతో ఈ వజ్రం సింహాసనం పైభాగంలో నెమలి తలపై కొలువుదీరిందట. ఈ నెమలి సింహాసనం అతి విలువైనదిగా చెబుతారు. దీని తయారీకి ఏడేళ్లు పట్టిందట. దీని కోసం చేసిన ఖర్చు నాలుగు తాజ్‌మహల్‌లు నిర్మించేందుకు ఎంత ఖర్చు అవుతుందో..ఈ సింహాసం తయారీ అంత వ్యయంతో కూడుకున్నదని చెబుతారు.
ఇదిలా ఉండగానే..ఫ్రెంచ్ యాత్రికుడు తవానీర్ ఔరంగజేబ్ పాలనలోకి వచ్చాడు. అప్పుడే ఔరంగజేబు అతనికి కోహినూర్‌ను చూపించగా, అతను దాని బొమ్మ గీయడానికి సిద్ధపడ్డాడట. అలా మొదటిసారిగా మనకు కోహినూర్ మొదటి చిత్రం లభించింది. వెనిస్‌కు చెందిన రత్నాల నిపుణుడు బోర్గియాకు కోహినూర్‌ను మరింత అందంగా తీర్చిదిద్దే బాధ్యతను ఔరంగజేబు అప్పగించాడట.. కానీ అతను దానిని నిర్లక్ష్యంగా కత్తిరించటం వల్ల 793 నుండి 186 క్యారెట్‌లకు తగ్గిపోయిందని సమాచారం.
అనంతరం ఈ కోహినూర్ వజ్రం మొఘల్ రాజుల చేతులు మారుతూ వచ్చింది. ఆ తరువాతి కాలంలో ఔరంగజేబు మనవడైన సుల్తాన్ మహమ్మద్ ఈ కోహినూర్ వజ్రాన్ని తీసి తన తలపాగాలో ధరించాడని చరిత్ర ఆనవాళ్లు చెబుతున్నాయి. ఆ తరువాతే సుల్తాన్ మహమ్మద్ తన స్నేహితుడైన పర్షియన్ రాజు నాదర్ షా కు బహుమతిగా ఇచ్చాడని చెబుతారు. అప్పుడే నాదిర్ షా వజ్రం నాణ్యత, మెరుపును చూసి దానికి కోహినూర్‌గా నామకరణం చేశాడు. ఈ బహుమతి వెనుక కూడా పైకి తెలియని రాజకీయ వ్యూహం ఉందనేది ఒక వాదన. అయితే, అలా కోహినూర్ వజ్రాన్ని దక్కించుకున్న పర్షియన్ రాజు నాదర్ షా ఆ తరువాతి కాలంలోనే హత్యకు గురయ్యాడు. అతని కుమారులు ఆదిల్ షా, ఇబ్రహీం కూడా హత్యకు గురైనట్టుగా చెబుతారు. వారి మరణానంతరం నాదిర్‌షా మనవడు షారుఖ్ కోహినూర్ వజ్రాన్ని ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన అహ్మద్ షాకు అప్పగించినట్టుగా చెబుతారు. షారూఖ్ నుంచి కోహినూర్‌ను సొంతం చేసుకున్న అహ్మద్ షా హఠాత్తుగా చనిపోయాడు. అతని రాజ్యం అల్లకల్లోలంగా మారింది. అతని కొడుకుల మధ్యే వజ్రం కోసం వివాదాలు, అంతర్యుద్దాలు జరిగాయి. అప్పుడు వారిలో ఇద్దరు కొడుకులు వజ్రంతో పంజాబ్‌కు పారిపోయారట. ఆ తరువాత పంజాబ్ రాజైన మహారాజా రంజిత్ సింగ్ కోహినూర్‌ను స్వాధీనం చేసుకున్నాడు. కానీ,అతను కూడా అతి తక్కువ సమయంలోనే మరణించాడట. రంజిత్ సింగ్ మరణానంతరం సింహాసనం కోసం జరిగిన పోటీతో బ్రిటిష్ వారు పంజాబ్‌ను ఆక్రమించేశారు. సిక్కు రాజులను అంతం చేసి పంజాబ్ ఆస్తులు కైవసం చేసుకుంది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ వెంటనే కోహినూర్ వజ్రాన్ని లాహోర్‌లోని బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఖజానాకు తరలించారు. భారతదేశానికి చెందిన వెలకట్టలేని సంపద కోహినూర్ వజ్రం విలువ, దాని సహజ సౌందర్యానికి ముగ్ధులైన ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పటి ఇంగ్లండ్ రాణి క్వీన్ విక్టోరియాకి బహుమతిగా అందజేసింది. 1850లో మొదటి సారి క్వీన్ విక్టోరియా తన కిరీటంలో కోహినూర్ వజ్రాన్ని ధరించారు. ఆ తరువాతి కాలం 1852లో కోహినూర్ వజ్రం కాంతి, వన్నే తగ్గిందని భావించిన విక్టోరియా మహారాణి దానికి మెరుగులు పెట్టించారట. డచ్‌కు చెందిన జ్యూవెలర్ కాంటోర్‌కు ఆ బాధ్యతను అప్పగించారు. దాంతో 186 క్యారెట్స్ ఉన్న కోహినూర్ కాస్త 108.93 క్యారట్లకు కరిగిపోయిందని చెబుతారు.
మొత్తానికి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరికిన ఈ అపార సంపద..అంచలంచెలుగా చేతులు మారింది. వజ్రం బ్రిటిష్ వారి ఆధీనంలోకి రావడానికి ముందు అనేక సార్లు పాలకులు, స్థానాలను మార్చింది. దాని చుట్టూ ఎన్నో కథలు, ప్రచారాలతో ముడిపడి ఉన్న ఈ కోహినూర్ వజ్రం రాజులకు కలసి రాలేదని, దానిని సొంతం చేసుకున్న వారు ఎవరూ ప్రశాంతంగా ఉన్న ఆనవాళ్లు కనిపించలేదనే వాదనలు ఎక్కువయ్యాయి. దాంతో ఈ విషయం రాణి విక్టోరియాకు చేరింది. ఈ వజ్రం ధరించిన వారంతా అకాల మరణానికి గురవుతున్నారని తెలిసి.. అప్పుడే ఒక వీలునామా రాయించారట.. ఎంతో విలువైన ఈ వజ్రాన్ని కేవలం అరుదైన సందర్భాల్లో మాత్రమే ఈ వజ్రాన్ని ధరించాలని చెప్పారట. రాజులు రాజ్యపాలన చేస్తుండగా, అతడి భార్య మహారాణి హోదాలో ఈ వజ్రాన్ని ధరించే హక్కుంటుందని ఆ వీలునామాలో పేర్కొన్నారు. ఇదే వీలునామా నేటికి ఆచరణలో కొనసాగుతోంది.
(పాఠకులకు గమనిక:చరిత్రలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న విషయాలను, మరి కొన్ని వాస్తవాలను ఆధారంగా చేసుకొని రాసిన కథనం ఇది)