ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ సాధనే లక్ష్యంగా మెరుగైన వైద్య సేవలు : మంత్రి 'రజని'

పల్నాడు జిల్లా , 04 జూన్ 2022 (ఇండియాజ్యోతి) :- ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖలో అమలుచేస్తున్న కార్యక్రమాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యులు నిస్వార్ధంగా, బాధ్యతగా చిత్తశుద్దితో పని చేయాలని రాష్ట్ర వైద్య మరియు కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రివర్యులు విడదల రజని కోరారు.
శనివారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల వైద్య ఆరోగ్య సమీక్ష సమావేశంలో రాష్ట్ర వైద్య మరియు కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రివర్యులు విడదల రజని, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యం.టి. కృష్ణ బాబు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ జే.నివాస్, ఏపీవివిపీ కమీషనర్ డా. వినోద్ కుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య మరియు కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రివర్యులు విడదల రజని మాట్లాడుతూ వైద్య రంగంలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు ప్రత్యేకమైన స్థానం వుందని, గుంటూరు మెడికల్ కళాశాలలో చదువుకున్న ఏంతో మంది ప్రఖ్యాత వైద్యులుగా ప్రపంచ దేశాలలో సేవలు అందిస్తున్నారన్నారు. ఇదే జిల్లాకు చెందిన తనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి అవకాశం కల్పించినందుకు అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గత 70 సంవత్సరాలలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. గత మూడు సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖకు ప్రతి సంవత్సరం 13 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, నాడు – నేడు పధకం ద్వారా ఆసుపత్రుల నిర్మాణం, మౌళిక సదుపాయాల కల్పనకు రూ. 16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. ఇటువంటి ప్రభుత్వంలో పని చేస్తున్న వైద్యులంతా ఎంతో అదృష్టవంతులని, ప్రభుత్వం పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలోని వైద్య సిబ్బంది పని చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 12 ఏళ్లగా పెండింగ్ లో ఉన్న పదోన్నతులను అర్హత ఉన్న వారందరికీ ఇచ్చారని, ఇన్ ఛార్జ్ పాలనలో ఉన్న టీచింగ్ ఆసుపత్రులకు సూపరింటెండెంట్లను, వైద్య కళాశాలకు ప్రిన్సిపల్స్ నిబంధనలు పాటిస్తూ నియమించడం జరిగిందన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోరుకునే ప్రభుత్వంగా వైద్యులకు ఇతర సిబ్బందికి అవసరమైన అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. వైద్య ఆరోగ్య రంగం ప్రాధాన్యత దృష్ట్యా ఎన్ని ఇబ్బందులు ఉన్న వైద్య ఆరోగ్య శాఖకు వేల కోట్ల నిధులు ఇస్తున్నారని, క్షేత్రస్థాయిలో సిబ్బంది బాధ్యతగా పనిచేస్తేనే వాటి ఫలాలు ప్రజలకు సమర్ధవంతంగా చేరుతాయన్నారు. జిల్లాలో ఉన్న డిఎంఇ ఆసుపత్రుల నుండి ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, సిహెచ్ సి లు, పి హెచ్ సి లలోని వైద్యులందరు సమన్వయంతో పని చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి జిల్లాకు కేటాయించిన ఎన్ఎంహెచ్ నిధులు వినియోగంకు ఆర్ధిక సంవత్సరం ప్రారంభం నుండే వైద్య శాలల్లో అవసరమైన మౌళిక సౌకర్యాల కల్పన కోసం ప్రతిపాదనలు రూపొందించేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేకే శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆసుపత్రులలో చిన్న చిన్న మౌళిక సౌకర్యాల సమస్యలను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధుల ద్వారానే పరిష్కరించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలలోని వైద్యశాలల పనితీరు సమీక్షలో ఆశించినంత మేరకు వైద్యుల పనితీరు సంతృప్తిగా లేదని, పనితీరు మెరుగుపరచుకునేందుకు కృషి చేయాలన్నారు. తదుపరి జరిగే సమీక్షా సమావేశంలో ఇదే తరహ పనితీరు వుంటే ఉపేక్షించేది లేదని, శాఖాపరంగా చర్యలకు సిఫార్సు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి వైద్యశాలలోను వైద్యసేవల కోసం వచ్చే ప్రజలకు కూర్చోవడానికి కుర్చీలు, త్రాగేందుకు మంచినీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో ఎంసిహెచ్ బ్లాక్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవడం జిల్లాకు చెందిన మంత్రిగా తన బాధ్యత అని, ఇదే మోడల్ గా రాష్ట్రం మొత్తం వైద్యసేవలు మెరుగుపరచేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేసేందుకు పరిపాలన పరంగా అమలు చేస్తున్న కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్యులు సహకారం అందించాలన్నారు.
తొలుత గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి మెటర్నల్ హెల్త్, ఇమ్మునైజేషన్, వెక్టర్ కంట్రోల్ మరియు హైజీన్ మెజర్స్, ఎపిడెమిక్ డిసీస్ సర్వెలెన్స్, బయోమెట్రిక్ అటెండేన్స్, డ్రగ్స్ బడ్జెట్, ఎన్ సి డీ సర్వే, టెలి మెడిసిన్, ఆరోగ్యశ్రీ పెర్ఫార్మన్స్ ఇన్ ఏపీవివిపీ హాస్పిటల్స్ తదితర అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యం.టి. కృష్ణ బాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలలో సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యులు పని చేయాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి రెండు వేల మందికి ఒక విలేజ్ క్లినిక్ ను, మండలానికి రెండు పిహెచ్ సి లను, నియోజకవర్గానికి ఒక సిహెచ్ సి ని జనాభాకు అనుగుణంగా ఏరియా ఆసుపత్రులను, బెడ్ల సామర్ధ్యాన్ని ఏర్పాటు చేసి నాడు – నేడు ద్వారా వైద్యశాలలో మౌళిక సదుపాయాల కల్పనతో పాటు అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చడం జరుగుతుందన్నారు. వైద్య శాఖలో వివిధ కార్యక్రమాలకు సంబంధించి వివరాలను ఎక్కువ యాప్ లు వినియోగిస్తున్నారని, వీటిన్నంటిని సరళతరం చేసి యాప్ ల సంఖ్యను తక్కువ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్యశాలలో ప్రజలు అందిస్తున్న వైద్య సేవలపై వైద్యుల పనితీరుపై, వైద్య పరీక్షలపై, మందుల పంపిణీ పై స్టాండర్డ్ ఫార్మాట్ లో ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుందన్నారు. వచ్చిన ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగా సంబంధిత విభాగాలలో లోటుపాట్లు వుంటే సరి చేయడం జరుగుతుందన్నారు. వైద్యులు మరియు వైద్య సిబ్బంది నూరు శాతం బయోమెట్రిక్ అటెండేన్స్ నమోదు చేసుకోవాలని, జూలై 1 నుండి బయోమెట్రిక్ అటెండేన్స్ వేయని వారికి ఆరోజు సెలవుగా పరిగణించి వారి ఖాతాలో ఉన్న సెలవులను అడ్జెస్ట్ చేయడం జరుగుతుందన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పుల వార్డుకు అత్యధికంగా బాలింతలు వస్తున్నారని, పి హెచ్ సి లు, సి హెచ్ సి, ఏరియా ఆసుపత్రులలో కాన్పుల సంఖ్య పెంచితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఒత్తిడి తగ్గుతుందన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లలో పి హెచ్ సి లలో బాలింతలు, చిన్న పిల్లల రిజిస్ట్రేషన్ సక్రమంగా జరగడం లేదని, ఆశించిన స్థాయిలో కాన్పులు జరగడం లేదన్నారు. సమస్యాత్మకమైన కాన్పులు మినహా సాధారణ కాన్పులన్ని పి హెచ్ సి, సిహెచ్ సి లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల లోనే చేయాలన్నారు. ఎస్ డి జి గోల్స్ లక్ష్యాలకు వ్యాక్సినేషన్ డేటా చాలా కీలకమని, వ్యాక్సినేషన్ వివరాలను ఎప్పటికప్పుడు యంసీహెచ్ యాప్ లో నమోదు అయ్యేలా డి యం అండ్ హెచ్ ఓ లు, ఇమ్యునైజేషన్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఆసుపత్రుల లోని వైద్య సేవలు, వైద్యుల పనితీరు, వైద్య ఆరోగ్య శాఖలో అమలు చేస్తున్న కార్యక్రమాల పురోగతిపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులతో నిరంతరం సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రులన్నింటిలో అత్యవసర మందులతో పాటు, ఇతర మందులు అందుబాటులో ఉండేలా ఏపీయంఐడీసీ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న వైద్యులు, ఇతర సిబ్బందిని పూర్తిస్థాయిలో భర్తీ చేయడం జరిగిందని, సూపర్ స్పెషాలిటీ వైద్యులకు సంబంధించి ఇప్పటికి భర్తీ కాని పోస్టులలో తాత్కాలిక పద్దతిలో వైద్యులను నియమించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వైద్య పరికరాల నిర్వహణకు సంబంధించి బయో ఇంజనీర్లను నియమించడం జరుగుతుందన్నారు. గ్రామ స్థాయిలో ఉన్న విలేజ్ క్లినిక్స్ నుండి, జిల్లా స్థాయిలోని డిఎంఇ ఆసుపత్రులలోని వైద్యులందరూ ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యానికి అనుగుణంగా నిర్లక్ష్యం లేకుండా నిబద్ధతతో విధులు నిర్వహించాలన్నారు.
సమావేశంలో పాల్గొన్న గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ జిల్లాలలోని పి హెచ్ సి, సి హెచ్ సి లలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని, జనాభాకు అనుగుణంగా వైద్యుల పోస్టులను పెంచాలని, సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించాలని కోరారు.
సమావేశంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల డి యం అండ్ హెచ్ ఓ లు, డి సి హెచ్ సి లు, పి హెచ్ సి, సి హెచ్ సి మెడికల్ ఆఫీసర్లు, ఏరియా, జిల్లా, డి ఎం ఇ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, రాష్ట్ర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
What's Your Reaction?






