ఆచూకీ లేకుండాపోయిన హెలికాప్టర్... ఆ 22 మంది ప్రాణాలతో ఉన్నట్టేనా?
రష్యాలో ఓ హెలికాప్టర్ ఆచూకీ లేకుండా పోయింది. ఆ హెలికాప్టర్ లో 22 మంది ఉండగా, వారి పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వారిలో ముగ్గురు సిబ్బంది కాగా, మిగిలిన 19 మంది ప్రయాణికులు. ఈ హెలికాప్టర్ కామ్ చెట్కా ప్రాంతంలోని వచ్కాజెట్స్ అగ్నిపర్వతం సమీపం నుంచి టేకాఫ్ అయింది. అయితే గమ్యస్థానం చేరకముందే అదృశ్యమైంది.
ఇది ఎంఐ-8టీ రకానికి చెందిన హెలికాప్టర్. దీంట్లో రెండు ఇంజిన్ లు ఉంటాయి. 60వ దశకం నుంచి ఈ రకం హెలికాప్టర్లు వినియోగంలో ఉన్నాయి. కాగా, హెలికాప్టర్ అదృశ్యమైన విషయాన్ని రష్యా ప్రభుత్వం నిర్ధారించింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.